: రజనీకాంత్, మహేష్ బాబుల్లో ఎవరిది అందమంటారు?: ప్రకాష్ రాజ్
‘మనుషులందరికీ కళ్లు, ముక్కు, పెదవులు ఒకేలా ఉండాలంటే కుదరదు. ఒక్కొక్కళ్లకు ఒక్కో రకంగా ఉంటాయి. అలా ఉండటమే అందం. ఇప్పుడు... రజనీకాంత్ ది అందమంటారా? లేక మహేష్ బాబు ది అందమంటారా?. వాళ్లలో మనం చూడాల్సింది అది కాదు. వాళ్లలోని ఆత్మవిశ్వాసాన్ని.. ఆ ఆత్మవిశ్వాసం కారణంగానే వాళ్లు నాకు అందంగా కనిపిస్తారు’ అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఒక టీవీ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. ఇండస్ట్రీలో కొందరితో ఆయనకు ఉన్న విభేదాల గురించి ప్రశ్నించగా... ఇవన్నీ సహజమేనని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగల్గుతామని, ఈ ప్రయాణంలో అన్నింటిని చూడాల్సిందేనని అన్నారు. అయితే, వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం మాత్రం తనకు లేదన్నారు. 'ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ముక్కోపిని. ఆ తర్వాత కొన్ని విషయాలకు మాత్రమే కోపం వస్తుండేది.. అయినా మనిషికి ఉన్న బలహీనతల్లో కోపం కూడా ఒకటి కదా?' అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.