: కొనసాగుతున్న డిమాండ్ తో పెరిగిన బంగారం ధర... కొనుగోళ్లు తగ్గి పడిన వెండి!
పండగ సీజన్ కొనసాగుతున్న వేళ, ఆభరణాల తయారీదారులు, రిటైల్ వ్యాపారుల నుంచి కొనుగోలు మద్దతు వెల్లువెత్తుతుండగా, బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. ఇదే సమయంలో వరుసగా ఐదు సెషన్లలో పెరుగుతూ వచ్చిన వెండి ధర నూతన కొనుగోళ్లు లేక పడిపోయింది. ఆభరణాల బంగారం ధర పది గ్రాములకు రూ. 50 పెరిగి రూ. 31,420కి చేరింది. స్వచ్ఛమైన బంగారం ధర కూడా అంతే మొత్తం పెరిగి రూ. 31,570కి చేరింది. డాలర్ విలువ స్థిరంగా సాగుతుండటంతో ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు రెండు వారాల గరిష్ఠ స్థాయి నుంచి దిగి రావడంతో ఆ ప్రభావం తదుపరి సెషన్లలో ఇండియాపై పడి బంగారం ధర స్వల్పంగా దిగిరావచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, వెండి ధర కిలోకు రూ. 110 తగ్గి రూ. 47,235కు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 0.1 శాతం తగ్గి 1,334.68 డాలర్లకు చేరగా, వెండి ధర 0.3 శాతం తగ్గి 19.78 డాలర్ల వద్ద నిలిచింది.