: రెండు లక్షల క్యూసెక్కులు దాటిన శ్రీశైలం వరద... సాగర్ కూ నీటి విడుదల పెంపు
జూరాల నుంచి ఉరుకులు పరుగులపై శ్రీశైలానికి వస్తున్న వరదతో ప్రాజెక్టు నీటి మట్టం శరవేగంగా పెరుగుతోంది. ఈ ఉదయం 1.70 లక్షల క్యూసెక్కులుగా ఉన్న వరద ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కులు దాటింది. ఉదయం నుంచి ఇప్పటి వరకూ ఒక అడుగు మేరకు నీటి నిల్వ పెరిగింది. 885 అడుగుల గరిష్ఠ నీటి మట్టం వరకూ నీటి నిల్వకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 878.7 అడుగులకు నీరు చేరింది. దీంతో సాగర్ కు వదులుతున్న నీటి మొత్తాన్నీ పెంచారు. జలాశయానికి 2,02,952 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 71,343 క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. సాగర్ వద్ద 69,163 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది. సాగర్ లో 515.1 అడుగుల మేరకు నీరుంది. శ్రీశైలంలో 181 టీఎంసీలు, సాగర్ లో 140 టీఎంసీల నీరుందని అధికారులు తెలిపారు. ఇదే వరద ప్రవాహం నాలుగు రోజులు కొనసాగితే, శ్రీశైలం, ఆపై మరో వారం రోజులు కొనసాగితే సాగర్ డ్యాములు పూర్తిగా నిండనున్నాయి.