: బాలకృష్ణ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకోలేదా?: చంద్రబాబుపై ముద్రగడ విసుర్లు
బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనపై ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబునాయుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకున్నారని కాపు సామాజిక వర్గం నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బావమరిదిని రక్షించుకోవడానికి, ఆయన్ను చట్టం ఉచ్చు నుంచి తప్పించడానికి చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించారు. కాపు ఉద్యమం పుట్టిందే చంద్రబాబునాయుడి వల్లని, ఉద్యమానికి మూల కారకుడు ఆయనేనని ముద్రగడ వ్యాఖ్యానించారు. "మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయి. ఎప్పుడూ నోటి నుంచి రాని పదాలు కూడా వస్తున్నాయి. మీరు మహా అయితే నన్ను ఆపేందుకు ఆఖరి అస్త్రంగా నా బట్టలు ఊడదీయించి, పోలీసుల బూటు కాళ్లతో తన్నిస్తారు. నన్నేమైనా చేసుకోండి. గతంలో మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. అప్పటిదాకా ఊరుకోబోను" అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో ఆయన డిమాండ్ చేశారు.