: యూరీ ఉగ్రదాడిపై పాక్ హస్తం.. తిరుగు లేని సాక్ష్యాలు లభ్యం!
యూరీ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని నిరూపించే బలమైన సాక్ష్యాలు జాతీయ దర్యాప్తు సంస్థకు లభించాయి. జమ్ముకశ్మీర్‌లోని యూరీలో ఆర్మీ బేస్‌క్యాంప్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు 18 సైనికులను హతమార్చిన సంగతి తెలిసిందే. సైన్యం కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో జపాన్‌లో తయారైన రెండు వైర్‌లెస్ సెట్లు లభ్యమయ్యాయి. వీటిని ఐసీఓఎం అనే సంస్థ నుంచి కొనుగోలు చేసిందని, వాటిపై ‘బిల్కుల్ నయా’(సరికొత్తవి) అని రాసి ఉందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వైర్‌లెస్ సెట్లను సాధారణంగా రక్షణ సంస్థలకు మాత్రమే విక్రయిస్తారని, వాటిని పాకిస్థాన్‌లో కూడా విక్రయిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఇవి పాక్ అధికారుల నుంచే అందాయనడానికి ఇది సజీవ సాక్ష్యమని తెలిపారు. వైర్‌లెస్ సెట్ల విషయాన్ని పాకిస్థాన్‌కు అధికారికంగా తెలియజేస్తామని ఎన్ఐఏ అధికారులు వివరించారు. కాగా ఉగ్రవాదుల నుంచి సైన్యం మొత్తం 48 వస్తువులను స్వాధీనం చేసుకుంది.