: ఇంటికొచ్చిన మొసలి.. పరుగులు తీసిన కుటుంబ సభ్యులు
తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో మొసళ్లు వీర విజృంభణ చేస్తున్నాయి. వాటి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా కల్యాణి నగర్‌కు చెందిన రైతు గణేశన్ ఇంటికి వచ్చిన మొసలిని చూసి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు లంకించుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఇంటిబయట అలికిడి కావడంతో వచ్చి చూసిన గణేశన్‌కు పై ప్రాణాలు పైనే పోయినంతపనైంది. ఇంటి ఆవరణలో యథేచ్ఛగా తిరుగుతున్న మొసలిని చూసి భయంతో వణికిపోయాడు. నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను నెమ్మదిగా లేపి ఇంటి నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు మూడు గంటల తర్వాత 7 అడుగుల పొడవు, 500 కేజీల బరువున్న మొసలిని చాకచక్యంగా పట్టుకున్నారు. సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో వాగుల ద్వారా మొసళ్లు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నట్టు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.