: బలూచ్ నేత బుగ్తీని చూసి భయపడుతున్న పాక్.. అప్పగించాలని ఇంటర్‌పోల్‌కు వేడుకోలు!


బలూచిస్థాన్ వేర్పాటువాద నేత, భారత్‌లో ఆశ్రయం కోరుతున్న బ్రహ్మదగ్ బుగ్తీని చూసి పాక్ భయపడుతోందా? పాక్ చర్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బలూచిస్థాన్‌లో పాక్ సాగిస్తున్న అకృత్యాలను విదేశాల్లో ఉంటూ ఎండగడుతున్న బుగ్తీని ఎలాగైనా పట్టుకోవాలని భావిస్తున్న పాక్ ఇంటర్‌పోల్‌కు లేఖ రాయాలని నిర్ణయించుకుంది.ఈమేరకు పాకిస్థాన్ అంతర్గత శాఖా మంత్రి చౌధరి నిసార్ అలీ ఖాన్ పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంటర్‌పోల్‌కు లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. బలూచ్ రిపబ్లికన్ పార్టీ(బీఆర్పీ) చీఫ్ అయిన బుగ్తీ ఇటీవల జెనీవాలోని ఇండియన్ కాన్సులేట్‌ను కలిసి భారత్‌లో ఆశ్రయం కోసం కోరారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న పాక్ అతడిని ఎలాగైనా పట్టుకోవాలని కంకణం కట్టుకుంది. బలూచ్ నేషనలిస్ట్ నేత అయిన నవాబ్ అక్బర్ బుగ్తీ మనవడే బ్రహ్మదగ్ బుగ్తీ. 2006లో నవాబ్ అక్బర్‌ను పాకిస్థాన్ ఆర్మీ చంపేసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉంటున్న బుగ్తీకి గడువు పొడిగించేందుకు ఆ దేశం నిరాకరించడంతో ఆయన భారత్‌లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన దరఖాస్తు ప్రస్తుతం భారత హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. బుగ్తీకి భారత్ సాయం అందిస్తోందని ఇప్పటికే పలుమార్లు భారత్‌ను నిందించిన పాక్ ఆయన భారత్‌లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ఆయనను ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది.

  • Loading...

More Telugu News