: రైతులకు చంద్రబాబు భరోసా.. ఆదుకుంటామని హామీ
రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని, వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న క్రోసూరు మండలంలోని పీసపాడు, క్రోసూరు, విప్పర్ల, అందుకూరు, ఊటుకూరు, బయ్యవరంలో శనివారం సాయంత్రం చంద్రబాబు పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించారు. పీసపాడులో వరదల్లో కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో అంచనాలు తయారుచేయించి రైతులను ఆదుకుంటామన్నారు. భారీ వర్షాలు, పంటనష్టంపై సీఎం చంద్రబాబు శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ వరద సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్డు, రైలు మార్గాలను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం అంచనాలు తయారుచేసి కేంద్రానికి పంపాలని సూచించారు. బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు.