: యూరీ ఉగ్రదాడిని మర్చిపోము... తగిన సమాధానం చెబుతాము: మోదీ


యూరీ సెక్టార్ పై దాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. పరోక్షంగా పాకిస్థాన్ ను తీవ్రపదజాలంతో విమర్శించారు. కేరళలోని కోజికోడ్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఆసియాను ఎదగనీయకుండా ఒక దేశం కుట్రలు పన్నుతోందని అన్నారు. 21వ శతాబ్దం ఆసియాది కాకుండా చూడాలని ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఉగ్రవాదంతో దేశం రక్తసిక్తమవ్వాలని ఆ దేశం కోరుకుంటోందని ఆయన పాకిస్థాన్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శించారు. అమాయకులను బలి తీసుకుంటూ ఆ ఒకేఒక్క దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ సాఫ్ట్ వేర్ ను ఎగుమతి చేస్తుంటే, ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతా ఐక్యమై పోరాడాలని ఆయన సూచించారు. ఆ దేశం ప్రోద్బలంతోనే యూరీ సెక్టార్ లో దాడి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. యూరీ సెక్టార్ లో ఆర్మీ స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోమని ఆయన అన్నారు. కారకులకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ఇంకా చెబుతూ, పాకిస్థాన్ నాయకులు చీటికీమాటికీ కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఆ దేశ ప్రజలను పక్కదారిపట్టిస్తున్నారని, ఈ విషయాన్ని వారు తెలుసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News