: మిషన్ కాకతీయ ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం!: సీఎం కేసీఆర్
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు పలు వివరాలు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రమే పూర్తిగా నిండలేదని కేసీఆర్ అన్నారు. శ్రీశైలం నిండిన తరువాత గేట్ల ద్వారా సాగర్‌లోకి నీరు రానుందని చెప్పారు. ఆల్మట్టి, నారాయణపూర్‌కి కూడా వరద నీరు వస్తుందని చెప్పారు. గోదావరి పరీవాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయిందని కేసీఆర్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 56 చోట్ల నీరు నిండిందని అన్నారు. భారీ వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మిషన్ కాకతీయ ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామన్నారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక అందిస్తామని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.