: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. పాల్గొన్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలను భారీగా వరదలు ముంచెత్తుతోన్న సంగతి తెలిసిందే. మరో ఐదు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతవరణ శాఖ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వర్షాల కారణంగా కష్టాల బారిన పడుతున్న ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు కూడా పాల్గొంటున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. వరదలతో నష్టపోయిన పంటలు, రోడ్ల పరిస్థితిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధుల ప్రణాళికపై కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు ఆర్మీ బృందాలు ఈరోజు హైదరాబాద్‌లోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.