: పాక్ ప్రధాని వ్యాఖ్యల ప్రభావం.. 'జిందగీ' ఛానల్‌లో పాకిస్థాన్ ప్రోగ్రాంలపై నిషేధం
పాక్ ఉగ్రవాదులు ఇటీవల జరిపిన యూరీ దాడి కారణంగా ఇప్పటికే పాకిస్థాన్ నటులకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. వారిని భారత్ విడిచిపెట్టివెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన 'జిందగీ' టీవీ ఛానల్ పాక్ దేశానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. పాక్ షోలన్నింటిన్నీ ఆపేయడానికి తాము ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు జీ మీడియా నెట్వర్క్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు సుభాశ్ చంద్ర తెలిపారు. ఐరాసలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల భారత్ గురించి పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేసిన ప్రసంగాన్ని తాము ఖండిస్తున్నట్లు సుభాశ్ చంద్ర సోషల్ మీడియాలోనూ పేర్కొన్నారు. జిందగీ ఛానల్‌లో పాక్, ఈజిప్ట్, టర్కీల నుంచి హిందీ, ఉర్దూ ప్రోగ్రామ్లు ప్రసారమవుతాయి. అందులో పాక్ నుంచి ప్రధానంగా జిందగీ గుల్జార్ హై, హమ్సఫర్ వంటి షోలను టెలికాస్ట్ చేస్తారు.