: మెదక్, వరంగల్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు.. పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు!
గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ ను వణికిస్తున్న వరుణుడి కన్ను ఇప్పుడు మెదక్, వరంగల్ జిల్లాలపై పడింది. గత రాత్రి నుంచి పలు చోట్ల ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్టు భారీ వర్షాలు కురుస్తుండగా, ఈ రెండు జిల్లాల్లో వాగులు, వంకలు, చిన్న నదులు భారీ ఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఏడుపాయల వద్ద చిన్న పిల్ల కాలువలా కనిపించే మూసీ నది పాయ, ఇప్పుడు మహోగ్రరూపం దాల్చింది. గుడిని ముంచెత్తిన వరద, అక్కడ చెక్ డ్యాం నిర్మిస్తున్న కూలీల పూరి గుడిసెలను తనతో తీసుకెళ్లిపోయింది. వారంతా ఓ చిన్న గుట్టపై తమ ప్రాణాలు కాపాడేవారి కోసం వేచి చూస్తున్నారు. సిద్ధిపేటలో ఆలయం గోడ కూలి ఒకరు మృతి చెందగా, సదాశివపేట మండలంలో ఓ బాలుడు ఆరూరు వాగులో గల్లంతయ్యాడు. వరంగల్ జిల్లాలో పలు చెరువులు నిండి గండి పడటంతో, వందలాది ఎకరాలు నీట మునిగాయి. పలు కాలనీలు, గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మొత్తం 40 టీములు వరద బాధితుల సహాయార్థం పనిచేస్తున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 5 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారికి అవసరమైన అన్ని సహాయక చర్యలూ చేపట్టామని జిల్లా పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. మరోవైపు మెదక్ జిల్లాలో వరద పరిస్థితిని మంత్రి హరీశ్ రావు స్వయంగా సమీక్షిస్తున్నారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు పురపాలక, పోలీస్ ఇతర ప్రభుత్వ సిబ్బందిని రంగంలోకి దించినట్టు తెలిపారు.