: ఆడుకుంటున్న బాలుడిని అటవీప్రాంతంలోకి లాక్కెళ్లి చంపేసిన చిరుతపులి

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని సాయ్ఖేడ గ్రామంలో ఓ చిరుత చేసిన దాడిలో సర్థక్ సోల్సె అనే నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సర్థక్ తల్లిదండ్రులు గ్రామ శివారులోని చెరుకుతోటలో పనికి వెళ్లారు. వారితో పాటు సర్థక్ కూడా వెళ్లి చెరుకుతోటలో ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు తమ పనిలో నిమగ్నమై ఉండగా, మరోవైపు నుంచి ఒక్కసారిగా బాలుడి వద్దకు వచ్చిన ఓ చిరుతపులి అతడిని నోటితో కరుచుకొని అటవీప్రాంతంలోకి లాక్కెళ్లింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు బాలుడి కోసం గాలిస్తుండగా సర్థక్ తీవ్రగాయాలతో అటవీప్రాంతంలో కనిపించాడు. గ్రామస్తులు గుంపుగా రావడాన్ని చూసిన చిరుత బాలుడిని వదలి, అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.