: వెంకయ్య నాయుడిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సీపీఐ నారాయణ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో వెంకయ్యనాయుడి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడు ప్రత్యేక సాయం అంటూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆయన రెండు లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకువస్తే తాను తిరుమల తిరుపతి శ్రీవారికి పాదపూజ చేస్తానని నారాయణ అన్నారు. ఒకవేళ వెంకయ్య ఆ నిధులు తీసుకురాలేకపోతే ఆయన ముక్కు నేలకు రాస్తారా? అని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవడం మానేసి రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా వెంకయ్యనాయుడు కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన పేర్కొన్నారు. హోదాను రాబట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమయిందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నేతలు దొందు దొందేనని ఆయన వ్యాఖ్యానించారు.