: మళ్లీ నేలచూపులు... 45 డాలర్ల దిగువకు ముడి చమురు ధర
చమురు సరఫరా నియంత్రణపై ఒపెక్ దేశాలు, నాన్ ఒపెక్ దేశాలు 28న ప్రత్యేక సమావేశం జరపనున్న నేపథ్యంలో క్రూడాయిల్ ధర శుక్రవారం నాడు భారీగా పడిపోయింది. నేటి సెషన్లో నైమెక్స్ ముడి చమురు ధర బ్యారల్ కు 4 శాతం తగ్గి 44.48 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర సైతం 3.7 శాతం దిగజారి 45.89 డాలర్లకు చేరింది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో సైతం ఒపెక్, నాన్ ఓపెక్ దేశాల సమావేశం విఫలం కావడం, మరో నాలుగు రోజుల్లో జరిగే సమావేశాల్లో సైతం ఏకాభిప్రాయం వెలువడే అవకాశాలు మృగ్యమని వచ్చిన వార్తల నేపథ్యంలోనే క్రూడాయిల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రష్యాలో ముడి చమురు ఉత్పత్తి రికార్డు స్థాయికి పెరగడం, అదంతా మార్కెట్లో అందుబాటులో ఉండటం కూడా ధర పతనానికి కారణమని తెలుస్తోంది. కాగా, భారత క్రూడాయిల్ బాస్కెట్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే 3.97 శాతం తగ్గి రూ. 123 పడిపోయి రూ. 2,987 వద్ద కొనసాగుతోంది.