: కృష్ణమ్మకు భారీ వరద... ప్రకాశం బ్యారేజీ 70 గేట్లూ ఎత్తివేత


గుంటూరు, నల్గొండ జిల్లాల పరిధిలో కురిసిన భారీ వర్షానికి నాగార్జున సాగర్ దిగువన కృష్ణా నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే పులిచింతల పూర్తిగా నిండిపోగా, వరద నీరంతా ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతుండటంతో, బ్యారేజ్ కి ఉన్న 70 గేట్లనూ అధికారులు ఎత్తివేశారు. మొత్తం 1.33 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని ఏపీ మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం తన క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, బ్యారేజ్ కి 1.40 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని, కాలువల ద్వారా 6,869 క్యూసెక్కులను పంట పొలాలకు విడుదల చేస్తున్నామని వివరించారు. కృష్ణా దిగువ ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. గుంటూరు జిల్లాలో సెప్టెంబరులో 109 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి వుండగా, 130 మి.మీ వర్షం కురిసిందని ఆయన అన్నారు. పులిపాడు మండలంలో అత్యధికంగా 171 మి.మీ వర్షం కురిసిందని ఉమ వెల్లడించారు.

  • Loading...

More Telugu News