: వరద సహాయక చర్యలు చేపట్టని ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


హైదరాబాద్‌లో కురిసిన భారీ వ‌ర్షాలతో నీటితో మునిగిపోయిన ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అల్వాల్ భూదేవీనగర్‌లో నీట మునిగిన ప్రాంతాన్ని ఈరోజు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు సందర్శించారు. వరద బాధిత ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ... వ‌ర్షాల కార‌ణంగా ఇళ్లు నీటమునిగిన ప్ర‌జ‌ల‌కి ప్ర‌భుత్వం పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని అన్నారు. స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా స‌ర్కారు కేవ‌లం ప్రకటనలకే పరిమితం అయ్యిందని వ్యాఖ్యానించారు. వ‌ర‌ద‌ల‌పై స‌ర్కారు వేగంగా స్పందించాల్సి వుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బాధితుల స‌మ‌స్య‌లకు ప‌రిష్కార మార్గాన్ని చూపించాల‌న్నారు. ఇక బాధితులకి త‌మ వంతు సాయం అందుతుంద‌ని చెప్పారు. ఈ సమస్యపై వచ్చే శాస‌న‌స‌భ‌ సమావేశాల్లో టీఆర్ఎస్ స‌ర్కారుని నిలదీస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News