: అమెరికాలోని చార్లట్‌లో అత్యవసర పరిస్థితి విధించడానికి కారణమైన కాల్పుల ఘటన వీడియో విడుదల


అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఇటీవ‌లే పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నల్లజాతీయుడు మృతి చెందిన విష‌యం తెలిసిందే. బ్రింట్లీ విన్సెంట్ అనే పోలీసు అధికారి చార్లట్ నగరంలో 43 ఏళ్ల న‌ల్ల‌జాతీయుడు కీత్‌ లామంట్‌ స్కాట్ పై ఈ కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌ కారణంగా ఆందోళ‌నలు చెల‌రేగడంతో ఆ నగరంలో అత్యవసర పరిస్థితిని విధించారు. అయితే, తాజాగా ఈ కాల్పుల‌కు సంబంధించి ఓ వీడియోను విడుద‌ల చేశారు. దీనిలో ప‌లు విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. స్కాట్‌పై కాల్పులు జ‌రుపుతుండ‌గా ఆయ‌న‌ భార్య రేకియా అదే ప్రాంతంలో ఉన్నారు. పోలీసులు కాల్పులు జ‌రుపుతుండ‌గా ఆమె ఆ దృశ్యాల‌న్నింటినీ తన మొబైల్‌ ఫోన్ ద్వారా వీడియో తీశారు. అందులో ఆమె భ‌ర్త తన వ‌ద్ద‌ ఆయుధాలు లేవని, తనని కాల్చొద్దని రేకియా వేడుకుంటున్న‌ట్లు వీడియోలో ఆ వాయిస్ కూడా రికార్డ‌యింది. దీనిపై రేకియా మాట్లాడుతూ.. స్కాట్ కారును పోలీసులు అడ్డగించిన అనంత‌రం అతడిని చుట్టుముట్టార‌ని పేర్కొన్నారు. వీడియోలో 'గన్‌ కింద పడేయ్‌' అంటూ స్కాట్‌పై పోలీసులు తుపాకీ ఎక్కుబెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. త‌న భ‌ర్త‌ను కారు నుంచి దిగి కిందకు రావాల్సిందిగా రేకియా సూచిస్తుండ‌గానే ఆమెకు కాల్పుల శబ్దాలు వినిపించాయి. అంతలోనే స్కాట్ మృతిచెందాడు. రెండు నిమిషాల వ్య‌వ‌ధితో ఉన్న ఈ వీడియోను రేకియా లాయర్‌ ద్వారా మీడియా ముందుంచారు. దీనిపై స్పందించిన‌ పోలీసులు స్కాట్‌ చేతిలోనూ తుపాకీ ఉందని అంటున్నారు. చార్ల‌ట్‌లో రేపు అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే ఆ న‌గ‌రంలో విధించిన‌ అత్యవసర పరిస్థితితో పాటు రాష్ట్రంలో చెల‌రేగుతోన్న న‌ల్ల‌జాతీయుల ఆందోళ‌న‌ల కారణంగా ఆమె త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దుచేసుకుంటున్న‌ట్లు తెలిపారు. కాల్పుల‌ ఘటనపై ఆమె స్పందిస్తూ వెంటనే దర్యాప్తు చేపట్టాల‌ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు. ఈ వీడియోను పోలీసులు అధికారికంగా మీడియా ముందుంచాల‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News