: అణు పరీక్షలు కొనసాగుతాయి, అణ్వాయుధాలు పెంచుకుంటాం: ఐరాసపై బల్లగుద్ది మరీ చెప్పిన ఉత్తర కొరియా
అణు పరీక్షలు జరపడంలోను, కొత్తగా అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలోను తమ దేశం వెనక్కి తగ్గేది లేదని ఉత్తర కొరియా, ఐక్యరాజ్యసమితి వేదికపై కుండ బద్దలుకొట్టింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు తాము ఎంత దూరమైనా వెళతామని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మంత్రి రి యాంగ్ హో స్పష్టం చేశారు. ఇప్పటికే అణ్వాయుధాలున్న దేశాలు తమను బెదిరిస్తున్నాయని ఆరోపించిన ఆయన, వారికి, ఐక్యరాజ్యసమితి ఆంక్షలకు తాము భయపడబోమని అన్నారు. తమ దేశంలో ఉన్న అణు ఆయుధాలను ఆత్మరక్షణకే వాడతామని, అమెరికా నుంచి ముప్పు ఉన్నందునే వీటిని డెవలప్ చేస్తున్నామని వివరించారు. అణు బాంబులు ఉండాలన్నది తమ దేశ విధానమని, ఇది మారబోదని వెల్లడించిన రి యాంగ్, తమ దేశానికి ఇరుగు, పొరుగు దేశాలతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, కొరియన్ ద్వీపకల్పంలో తమ దేశ ప్రజలు భద్రంగా ఉండాలంటే, ఈ తరహా ఆయుధాలు తప్పనిసరని చెప్పారు. తమను భయపెట్టేందుకు దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా అణ్వాయుధ విన్యాసాలు చేస్తున్నాయని ఆరోపించిన ఆయన, దేశ రాజధాని ప్యాంగ్ యాంగ్ ను ఆక్రమించాలని రెండు దేశాలూ కుట్ర చేస్తున్నాయని అన్నారు. నార్త్ కొరియా గగనతలంపై అమెరికాకు చెందిన బీ1-బీ స్ట్రాటజిక్ బాంబర్ చక్కర్లు కొట్టడాన్ని ప్రస్తావిస్తూ, అమెరికా ఊహించని విధంగా దెబ్బకొట్టే సత్తా తమకుందని హెచ్చరించారు.