: హైదరాబాద్‌లో మరోసారి భారీవర్షం.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్న ఆర్మీ
హైదరాబాద్‌ను వర్షాలు వీడనంటున్నాయి. ఈరోజు ఉదయం పలుచోట్ల మరోసారి భారీవర్షం పడింది. తెలంగాణలో వరద సహాయక చర్యలకు సహకరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ కల్నల్ జీబీఎంయూ రావుకి నిన్న లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈరోజు నుంచి సహాయక చర్యలు చేపట్టడానికి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అల్వాల్ పీఎస్‌లో ఉన్న ఆర్మీ బృందం కాసేపట్లో హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలకు బయలుదేరనుంది. మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, యూసఫ్‌గూడ, పంజాగుట్ట, నాంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో భారీవర్షం పడింది. మరో ఐదురోజుల పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా కూకట్‌పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో కొన్ని పాఠశాలలను తెరిచే ఉంచారు. కూకట్‌పల్లి ధరణీనగర్‌లో ఓ స్కూలు బస్సు నీటిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ చిన్నారులని స్థానికులు రక్షించారు. పిల్లలు అక్కడి నుంచి తమ ఇళ్లకు వెళుతున్నట్లు తెలుస్తోంది.