: ఫంక్షన్ హాల్‌లో చిక్కుకున్న పెళ్లి బృందం.. గోడను బద్దలు గొట్టి రక్షించిన పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ఫంక్షన్‌హాల్‌లో ఓ పెళ్లి బృందం చిక్కుకుపోయింది. వరద క్షణక్షణానికి ఉద్ధృతమవుతుండంతో తిరుమల్‌గార్డెన్‌లో చిక్కుకుపోయిన పెళ్లి బృందం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గోడను ధ్వంసం చేసి పెళ్లి బృందాన్ని రక్షించారు. అలాగే జిల్లాలోని భైంసాలోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మెదక్ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఏడుపాయల వనదుర్గ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీరా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో నీరు ఆలయంలోకి చేరుకుంది. దీంతో ఆలయ అధికారులు ఆలయాన్ని మూసివేశారు.