: నాది కట్టుకథ అయితే నిజాలు మీరు చెప్పండి.. జైపాల్‌రెడ్డికి ఉండవల్లి సవాలు


కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై తాను రాసిన పుస్తకం కట్టుకథ అంటూ జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన ఉండవల్లి.. ‘‘నాది కట్టుకథ అయితే నిజమేంటో మీరు చెప్పండి’’ అంటూ సవాలు విసిరారు. నాడు స్పీకర్ చాంబర్‌లో సుష్మాస్వరాజ్, కమలనాథ్ మధ్య రాజీ కుదిర్చానని మీరే చెప్పారని, ఇప్పటికైనా అసలు లోపల ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని రోటరీహాల్‌లో ఉండవల్లి మాట్లాడుతూ అప్పట్లో స్పీకర్ చాంబర్లో జరిగింది చెబితే తాను ఎన్నికల్లో గెలిచేవాడినని జైపాల్‌రెడ్డి అన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు జరిగిన విషయాన్ని బయటకు చెప్పలేకపోయారంటే దానర్థం అక్కడ కుట్ర జరిగిందని అని అన్నారు. రాజ్యసభలో చిరంజీవి వంటి నేతలు వెల్‌లో ఉండగానే ఓటింగ్ ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. విభజన బిల్లు పాసవలేదని, కాంగ్రెస్, బీజేపీ కలిసినా మెజారిటీ లేకపోవడంతో ఓటింగ్ లేదు, గీటింగు లేదు అని జైపాల్ సలహా ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికీ మించిపోయింది లేదని, అసలు లోపల ఏం జరిగిందో ఇప్పటికైనా చెబితే ప్రజలకు కొంత సాంత్వన లభిస్తుందని అన్నారు. కేసీఆర్ చనిపోయేటట్టు ఉన్నాడు అని చెప్పకపోతే తెలంగాణ వచ్చేది కాదని ప్రకటించారని, అలాగే ఇప్పుడూ చెప్పాలని, లేదంటే రాజ్యాంగ విరుద్ధ సలహా ఇచ్చానని అంగీకరించాలని డిమాండ్ చేశారు. సెంటిమెంట్ కారణంగానే అటువంటి సలహా ఇచ్చానని చెబితే విలువ పెరుగుతుందని ఉండవల్లి వ్యంగ్యం విసిరారు. ప్రత్యేక హోదా కోరుతున్న జగన్, పవన్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నేతలంతా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి టీడీపీ, బీజేపీపై పోటీచేస్తే ఫలితం ఉంటుందని ఉండవల్లి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News