: కోస్తాకు పొంచి ఉన్న వరద ముప్పు.. ప్రమాదస్థాయిలో ఉత్తరాంధ్ర ప్రధాన నదులు
వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాడు. వర్షం ధాటికి ఆంధ్రప్రదేశ్‌లో పలు గ్రామాలు నీట మునిగాయి. గుంటూరు జిల్లా తన రూపురేఖలు కోల్పోయింది. ఇక ఉత్తరాంధ్రలోని పలు ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. గుంటూరు జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిన్న కురిసిన వానలకు ఆరు మండలాల్లో పది సెంటీమీటర్ల వర్షం కురిసింది. నడికుడి సెక్షన్‌లో ట్రాక్ మరమ్మతు పనులు పూర్తికాకపోవడంతో ఈ మార్గంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. కోస్తాలో మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరులో శుక్రవారం ఉదయం వరకు 49 మండలాల్లో 28.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పిడుగురాళ్లలో అత్యధికంగా 20.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రభుత్వం ఐదు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్ బృందం, పోలీస్ స్పెషల్ పార్టీ బృందాలను రంగంలోకి దించింది. అలాగే సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్‌ను కూడా వినియోగిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని గోరంట్లకు చెందిన నందిగామ రమేష్ పొలం చూసేందుకు వెళ్లి వాగులో కొట్టుకుపోయాడు. ఎడతెరిపి లేకుండా వర్షాలకు విశాఖపట్నం జిల్లాలోని శారదా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి, మహేంద్రతనయ నదులు కూడా ఉప్పొంగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో గడుపుతున్నారు. మరోవైపు వానల ధాటికి విశాఖపట్నం జిల్లాలోని పాడేరు ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు వాగుల్లో పడి ఏడుగురు గల్లంతుకాగా ఐదుగురి మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావాటి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.