: సెల్ఫీ తీస్తున్న యువకుడిపై కొండచిలువ దాడి!
యువతకి సెల్ఫీ పిచ్చి ఎంతగా పట్టుకుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆ మోజులో పడి ప్రమాదకర ప్రదేశాల్లో, జంతువులతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నా యువత అందులోంచి బయటపడలేకపోతున్నారు. అటువంటి ఘటనే తాజాగా రాజస్థాన్‌లో మరొకటి వెలుగులోకొచ్చింది. కొండచిలువతో సెల్ఫీకి ప్రయత్నించిన యువకుడిపై అది దాడి చేసింది. ఆ రాష్ట్రంలోని మౌంట్‌అబూలోని ఓ హోటల్ పరిసరాల్లో ఈరోజు ఓ భారీ కొండచిలువ కనిపించింది. విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకొని కొండచిలువను పట్టుకున్నారు. వారు అక్కడి నుంచి దాన్ని తీసుకెళుతోన్న సమయంలో ఓ యువకుడు దాని వద్దకు వెళ్లి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా అది సదరు యువకుడిపై దాడి చేసింది. వెంటనే స్పందించిన సిబ్బంది కొండచిలువను అదుపు చేశారు. దీంతో యువకుడు దాని బారి నుంచి బయటపడ్డాడు.