: డిలీటెడ్ అకౌంట్ల సమాచారం తొలగించండి: ‘వాట్సాప్’కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’లో తమ అకౌంట్లు డిలీట్ చేసుకున్న వారి సమాచారాన్ని, అందులో నుంచి తొలగించాలని.. ‘ఫేస్ బుక్’తో ఈ సమాచారాన్ని పంచుకోవద్దని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ‘వాట్సాప్’ తదితర మెసేజింగ్ యాప్ లను కూడా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కిందకు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా, కొత్త ప్రైవసీ పాలసీతో ‘వాట్సాప్’ వినియోగదారుల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని రెండు రోజుల క్రితం జరిగిన విచారణలో ‘వాట్సాప్’ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ కారణంగా ఇతరులెవ్వరూ మెసేజ్ లు చదవలేరని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ‘వాట్సాప్’లో సమాచారాన్ని తన మాతృసంస్థ ‘ఫేస్ బుక్’ తో పంచుకునేందుకు అంగీకరిస్తూ సదరు సంస్థ ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను ఈరోజు విచారించింది.