: టెన్నిస్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపుల కేసులో తుది తీర్పు ఇచ్చిన సుప్రీం.. కానీ దోషి జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు!
సుమారు 25 ఏళ్ల క్రితం బలవన్మరణానికి పాల్పడిన టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిర్హోత్ర కేసును విచారించిన సుప్రీంకోర్టు ఈరోజు తుది తీర్పును ఇచ్చింది. అయితే, కేసులో దోషిగా తేలిన మాజీ డీజీపీ ఎస్‌పీఎస్ రాథోడ్ జైలు శిక్ష అనుభవించే వీలు లేదు. ఈ కేసులో ఇన్నాళ్లూ నిందితుడిగా ఉన్న ఆయన ఇప్పటికే జైలు శిక్ష అనుభవించారు. దీంతో ఆయన శిక్షను అనుభవించడానికి జైలుకు వెళ్లడం లేదు. కేసులో దోషి ఎస్‌పీఎస్ రాథోడ్ 1990లో అప్పటి ఐజీపీగా, హరియాణా లాన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆత్మహత్య చేసుకున్న 14 వేళ్ల రుచికా గిర్హోత్ర అనే జూనియర్ టెన్నిస్ క్రీడాకారిణిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె రాథోడ్‌పై కేసు పెట్టింది. ఓ ఉన్నతాధికారిపై రుచికా కేసు పెట్టినందుకు ఆమెను పాఠశాల నుంచి తొలగించారు. మరోవైపు తాము కేసుపెట్టినందుకు పోలీసులు తమను వేధిస్తున్నారంటూ రుచిక కుటుంబం ఆరోపించింది. చిన్న వయసులోనే ఎంతో ఒత్తిడికి గురయిన రుచిక 1993, డిసెంబర్ 28న విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు ఇరవై ఏళ్ల తరువాత ఆమెపై వేధింపుల కేసులో విచారణ చేపట్టిన చండీగఢ్ న్యాయస్థానం చివరకు రాథోడ్‌ను దోషిగా తేల్చింది. 2009 డిసెంబర్‌లో కేసులో తీర్పునిస్తూ, రాథోడ్‌కు 18 నెలల శిక్ష విధించింది. ఆ మరుసటి ఏడాది జూన్‌లో రాథోడ్ జైలుకు వెళ్లారు. రాథోడ్ జైలులో ఐదు నెలల శిక్ష అనుభవించగానే ఆయనకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. కేసులో విచారణను కొనసాగించిన సుప్రీంకోర్టు ఈరోజు తుది విచారణ చేపట్టి రాథోడ్‌ను దోషిగా తేల్చింది, ఆయనపై చండీగఢ్ న్యాయస్థానం విధించిన 18 నెలల శిక్షను ఐదు నెలలకు తగ్గించింది. అయితే ఇది వరకే ఆయన ఐదు నెలలు జైలులో గడపడంతో ఆయన మళ్లీ జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు.