: ఆనాడు ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వినుంచి దించాక ఆయ‌న‌కు క‌నీసం మాట్లాడే అవ‌కాశమ‌యినా ఇవ్వ‌లేదు: వైసీపీ నేత‌ పెద్దిరెడ్డి


ఇటీవ‌ల జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌త్యేక హోదా అంశంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డుతూ వైసీపీ నేత‌లు శాస‌న‌స‌భ‌ను స్తంభింపజేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మావేశాల్లో జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ ఈరోజు స‌మావేశమైంది. 45 రోజుల్లో స్పీక‌ర్‌కు నివేదిక ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. త‌మ‌పై చర్య‌లు తీసుకునేలా చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నిందని ఆయ‌న ఆరోపించారు. అందులో భాగంగానే య‌న‌మ‌ల శాస‌న‌స‌భ‌లో త‌మ‌ని స‌స్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్ర‌వేశపెట్టారని ఆయ‌న అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ స‌మావేశాల్లో ఏపీ ప్ర‌భుత్వ నేత‌లు రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రించార‌ని పెద్దిరెడ్డి అన్నారు. స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేశాకే స‌భ‌లోకి మార్ష‌ల్స్ రావాలని, అందుకు భిన్నంగా టీడీపీ నేత‌లు ప్ర‌వ‌ర్తించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. స‌భ‌ను మార్ష‌ల్స్‌ని పెట్టే న‌డ‌పాల‌ని ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న అన్నారు. తాము అసెంబ్లీలో ఎవ‌రిపైనా దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌లేదని చెప్పారు. తమ ఎమ్మెల్యేలెవ‌రిపైనా చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని క‌మిటీని కోరిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అసెంబ్లీ స్పీక‌ర్‌, గ‌వ‌ర్న‌ర్‌పైకి వెళ్లే ప‌ద్ధ‌తి టీడీపీ నేత‌ల‌దేన‌ని ఆయ‌న అన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి దించాక ఆయ‌న‌కు క‌నీసం మాట్లాడే అవ‌కాశమ‌యినా ఇవ్వ‌లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. అందులో య‌న‌మ‌ల పాత్ర‌కూడా ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News