: శిథిలావస్థలో వందేళ్ల నాటి భవనం.. రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ ఖాళీ చేయాలని ఆదేశాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష్ (జీహెచ్ఎంసీ) పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ విధంగా గత రెండు రోజులుగా 13కు పైగా భవనాలను కూల్చివేశారు. ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ ను కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయనున్నారు. ఈ నేపథ్యంలో సదరు పోలీస్ స్టేషన్ ను వెంటనే ఖాళీ చేయాలని పురపాలక శాఖ నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నానికి భవనాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. కాగా, నిజాం కాలంలో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ భవనానికి వందేళ్ల చరిత్ర ఉంది. వర్షాల కారణంగా ఈ భవనం కూలే అవకాశముందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇక్కడి నుంచి పోలీస్ సిబ్బందిని ఖాళీ చేయమని చెప్పామని అధికారులు అంటున్నారు.