: రోడ్లు బాగాలేవు... నీరు తోడుతున్నాం...వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం: కేటీఆర్
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, చేపడుతున్న చర్యలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జంటనగరాల్లో చేపట్టిన చర్యలపై ఆరాతీశారు. ఏయే ప్రాంతాలను నీరు ముంచెత్తిందన్న విషయంపైన, నాలాలు, కాల్వల పనితీరుపైన ఆయన తెలుసుకున్నారు. వర్షాల ధాటికి రోడ్లు పాడైపోయాయని ప్రతి కాలనీనుంచి ఫిర్యాదులు ఉన్నాయని, వర్ష బీభత్సానికి రోడ్లు కొట్టుకుపోయాయని ఆయన తెలిపారు. చెరువుల కట్టలు తెగిపోనున్నాయనే పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. సెల్లార్ లలో ఉన్న నీటిని యుద్ధప్రాతిపదికన తోడిస్తున్నామని ఆయన చెప్పారు. నిజాంపేట్ లోని భండారీ లేఅవుట్ లో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని ఆయన తెలిపారు. హుస్సేన్ సాగర్ వర్షపు నీటితో నిండిపోయిందని ఆయన చెప్పారు. జంటనగరాల్లో ఉన్న అన్ని చెరువులు 80 శాతం నిండిపోయాయని ఆయన పేర్కొన్నారు. వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. రోడ్ల మరమ్మతులు త్వరలో చేపడతామని ఆయన తెలిపారు.