: విమానంలో పొగ... ఎమర్జెన్సీ ల్యాండింగ్!

జెట్ స్టార్ సంస్థ కు చెందిన ఎయిర్ బస్ ఏ320 విమానంలో ఒక్కసారిగా పొగలు చుట్టుముట్టడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరైన వైనం ఇది. వివరాల్లోకి వెళ్తే... సిడ్నీ నుంచి కెయిర్న్స్ వెళ్తున్న విమానంలో అంతా ప్రశాంతంగా ఉన్న వేళ, విమానంలో పొగలు వ్యాపించాయి. అసలే ఆక్సిజన్ అంతంతమాత్రంగా ఉండే విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో విమానంలోని ఒక ఇంజన్‌ ను ఆపేసిన పైలట్, దానిని అత్యవసరంగా బ్రిస్బేన్‌ కు దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం ప్రయాణికులను దించివేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో పడ్డారు. విమానంలో పొగలు అలముకున్న సందర్భంలో తీసిన వీడియోను ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పెట్టడంతో దానిని అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసింది. దీనిపై మరో ప్రయాణికుడు స్పందిస్తూ, విమానంలో ఒక్కసారిగా దట్టంగా పొగ అలముకుందని, దీంతో ప్రెజర్ తగ్గిపోయిందని, దాంతో భయం వేసిందని, తన జీవితంలో తొలిసారిగా భయపడ్డ క్షణాలు అవేనని వారు పేర్కొన్నారు. విమానంలో చోటుచేసుకున్న ఘటనపై జెట్ స్టార్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో విమానానికి ఉన్న రెండు ఇంజన్లలో ఒకదాంట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగానే ఒక ఇంజన్‌ ను పైలట్ ఆపేశారని చెప్పింది. తమ ఇంజనీర్లు ఈ సమస్యను పరిష్కరిస్తున్నారని, అయితే విమానంలో పొగలు రావడం చాలా అసాధారణంగా జరుగుతుందని, ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై తమ సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చామని జెట్ స్టార్ సంస్థ తెలిపింది.

More Telugu News