: జంటనగరాల పరిస్థితిపై ట్రాఫిక్ పోలీసుల సూచనలివే!
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంటనగరాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సాధ్యమైనంత వరకు నగరవాసులు ఇళ్లనుంచి బయటకు రావొద్దని, అవకాశమున్నంతవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితిపై అప్ డేట్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12 శ్మశానం వద్ద పెద్ద గోతులు పడ్డాయన్నారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ చివర మహావీర్ ఆసుపత్రి వద్ద పరిస్థితి బాగోలేదని చెప్పారు. బంజారాహిల్స్ శాంతిభద్రతల ఔట్ పోస్టు దగ్గర అపోలో ఆసుపత్రి నుంచి విజయాబ్యాంకుకు వెళ్లే దారిలో పెద్ద చెట్టు కూలిపోయిందని అన్నారు. కేబీఆర్ పార్కు నుంచి భారీగా వర్షపు నీరు బయటకు వస్తోందని తెలిపారు. దాంతో జూబ్లీహిల్స్ వైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, గాంధీభవన్ వద్ద నీరు నిలిచిపోయిందని చెప్పారు. నాంపల్లి రైల్వేస్టేషన్ వైపు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాలేదని, నిమ్స్ ఆసుపత్రి వద్ద భారీగా నీరు నీలిచి పోయిందని వారు వెల్లడించారు. మలక్ పేట గంజ్ గేట్ నెం.1 వద్ద రోడ్డు మొత్తం పాడైపోయిందని ఆయన తెలిపారు. దీంతో మలక్ పేట గంజ్ నుంచి అక్బర్ బాగ్ వైపు ట్రాఫిక్ మళ్లించినట్టు తెలిపారు. పురానాపూల్-జియాగూడ రోడ్డులో ఓ ఇంటి గోడ కుప్పకూలి రోడ్డుపై పడడంతో అక్కడ వాహనాలు నిలిచిపోయాయని, రోడ్డును బ్లాక్ చేయాల్సి వచ్చిందని, అందుకని అటువైపు రావద్దని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.