: పెద్ద ఎత్తున వరద వస్తోంది: మంత్రి దేవినేని
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఈరోజు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాల ధాటికి పెద్ద ఎత్తున వరద వస్తోందని ఆయన అన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు నిండాలని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు వేల టీఎంసీలకు పైగా గోదావరి నుంచి వరద నీరు వచ్చి సముద్రంలోకి కలుస్తోందని చెప్పారు. శ్రీశైలంలో 875 అడుగుల నీటి మట్టం ఉందని దేవినేని పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌లో 514 అడుగుల నీటిమట్టం ఉందని చెప్పారు. జూరాల నుంచి 45,600 క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. గుంటూరులో అత్యధికంగా వర్షపాతం నమోదయిందని, సంబంధిత సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.