: బీజేపీ ఎంపీ అత్యుత్సాహం... యూరీ జవాను కుటుంబం ఆగ్రహం!


బీజేపీ ఎంపీ చేసిన పని యూరీ సెక్టార్ లో ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరజవాను కుటుంబాన్ని ఆవేదనకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే... కశ్మీర్‌ లోని యూరీ సెక్టార్ పై జరిగన ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్‌ కు చెందిన జవాను గణేశ్‌ శంకర్‌ యాదవ్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గణేశ్‌ మృతదేహానికి ఆయన స్వగ్రామమైన గురాపలిలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. దీనికి హాజరైన బీజేపీ ఎంపీ శరద్‌ త్రిపాఠి వీరజవాను మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, గణేశ్‌ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగని ఆయన ఎవరికి తోచినంత సాయం వారు చేయాలని కోరారు. దీంతో పలువురు దేశభక్తులు డబ్బులిచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పటికే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన అమరజవాను కుటుంబ సభ్యులను ఇది తీవ్రంగా బాధించింది. దీనిని అవమానంగా భావించిన అమర జవాను భార్య గడియా, తామేమీ బిచ్చగాళ్లం కాదని మండిపడ్డారు. సైనిక లాంఛనాలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయని, తమను ఇలా అవమానించవద్దని ఆమె ఆయనకు స్పష్టం చేశారు. దీంతో తోకముడిచిన బీజేపీ ఎంపీ తన అనుచరులతో కలసి అక్కడి నుంచి నిష్క్రమించారు. దీనిపై పలువురు స్థానికులు మండిపడుతున్నారు. ఎంపీగా సాయం చేయాల్సిన ఆయన అక్కడున్న వారి నుంచి చందాలు వసూలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, ఆ కుటుంబాన్ని అవమానించడం తన ఉద్దేశం కాదని, వారికి సాయం చేయాలని మాత్రమే చూశానని అన్నారు.

  • Loading...

More Telugu News