: పీవీ సింధును 6 లక్షల విలువైన వజ్రాభరణంతో సత్కరించిన ఎన్ఏసీ జ్యుయలర్స్
రియో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కు రజత పతకం సాధించిన క్రీడాకారిణి పీవీ సింధును ఎన్ఏసీ జ్యుయలర్స్ సంస్థ వజ్రాభరణంతో సత్కరించింది. చెన్నైలోని టి.నగర్ లో ఉన్న ఎన్ఏసీ షోరూంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సంస్థ చైర్మన్ నాదెళ్ల ఆంజనేయులు చెట్టి, ఎండీ అనంతపద్మనాభన్ లు సింధుకు జ్ఞాపిక, 6 లక్షల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ ను బహూకరించారు. ఈ సందర్భంగా అనంతపద్మనాభన్ మాట్లాడుతూ, రియో ఒలింపిక్స్ లో రజతపతకం సాధించడం ద్వారా సింధు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిందని అన్నారు. సింధుతో పాటు సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లకు కూడా నగదు బహుమతులు పంపించామని అన్నారు. ఎన్ఏసీ జ్యుయలర్స్ తనను సత్కరించడం ఆనందంగా ఉందని సింధు తెలిపింది.