: వేధింపుల వడ్డీ వ్యాపారిని హత్య చేసిన అక్కాచెళ్లెళ్లు!


లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వడ్డీ వ్యాపారిని ముగ్గురు అక్కాచెళ్లెళ్లు హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని షామిలీ పట్టణంలో కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... షామిలీలో నివాసముండే ఓ వ్యక్తికి ఇంటి నిర్మాణం నిమిత్తం వడ్డీ వ్యాపారి షమీమ్ అహ్మద్ లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అనంతరం అప్పు తీర్చాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ... షమీమ్ అహ్మద్ కన్ను అప్పు తీసుకున్న వ్యక్తి పెద్దకుమార్తె (27) పై పడింది. దీంతో ఆమెను తన వద్దకు పంపితే రుణం తీర్చాల్సిన అవసరం లేదని ఆయన బేరం పెట్టాడు. దీంతో వారిలో ఒక అమ్మాయి, తన సోదరితో గడిపేందుకు తమ ఇంటికి రావాలని అతనిని ఆహ్వానించింది. కోరుకున్న అవకాశం వచ్చిందని భావించిన వడ్డీవ్యాపారి అహ్మద్ నేరుగా వారింటికి వెళ్లగానే... ముగ్గురు అక్కా చెల్లెళ్లు కలసి మూకుమ్మడిగా అతనిపై కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం హతుడి కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, అతనిపై దాడి చేసిన మూడు కత్తులను స్వాధీనం చేసుకుని, ముగ్గురు అక్కాచెల్లెళ్లను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. షమీమ్ అహ్మద్ శరీరంలో 20 కత్తి పోట్లు ఉన్నట్టు పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లతో పాటు హత్యకు సహకరించిన వారి తండ్రి, ఒక యువతి బాయ్ ఫ్రెండ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News