: హృదయం ద్రవించింది...అమరవీరుల పిల్లల్ని నేను చదివిస్తాను: గుజరాత్ వ్యాపారవేత్త
కశ్మీర్, యూరీ సెక్టార్ లోని ఉగ్రవాదుల దుశ్చర్యకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల్లో ఓ జవాను కుమారుడు... తండ్రిపోయిన బాధతో కన్నీరుమున్నీరవుతూ 'నాన్న నన్ను బాగా చదువుకోవాలని చెప్పారు' అనడం తన హృదయాన్ని ద్రవింపజేసిందని గుజరాత్ లోని సూరత్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మహేష్ సవానీ తెలిపారు. దీంతో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. వారికి తాను నడుపుతున్న పీపీ సవానీ పాఠశాలలోనే ఉచిత విద్యనందించేందుకు సిద్ధంగా ఉన్నానని మహేష్ సవానీ తెలిపారు. మంచి విద్యతోపాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. సామాజిక సేవలో భాగంగా మహేష్ సవానీ ఇప్పటికే తల్లిదండ్రుల్లేని 472 మంది ఆడపిల్లలకు దగ్గరుండి మరీ వివాహాలు జరిపించి, వారికి దేవుడిచ్చిన తండ్రిగా మారిన సంగతి తెలిసిందే.