: ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం కల్పించండి...కంపెనీలను కోరిన జీహెచ్ఎంసీ
హైదరాబాదు నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కాస్త తెరిపిస్తే నగర వాసులు నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు, విధులకు హాజరయ్యేందుకు ఇళ్ల నుంచి బయటకు వస్తుండడంతో, హైదరాబాదు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేడు, రేపు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అలాగే కీలకమైన ఐటీ పరిశ్రమ ఉద్యోగులకు ఈ రెండు రోజులు ఇంటి నుంచి విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులు ఐటీ కంపెనీలకు సూచించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇంటి నుంచి పని చేయడమే ఉద్యోగులకు మంచిదని వారు కోరారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా, వీకెండ్ కావడంతో వివిధ ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో వారాంతపు సరదాలకు దూరంగా ఉండి, జీహెచ్ఎంసీకి సహకరించాలని అధికారులు నగరవాసులను కోరారు.