: హైదరాబాదులో డేంజర్ బెల్స్...లోతట్టు ప్రాంతాల ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి: జీహెచ్ఎంసీ హెచ్చరికలు


చెరువులు, కుంటలు నిండిపోయాయి! నాలాలు పొంగిపొర్లుతున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండలా మారింది. కాలనీలు జలమయమయ్యాయి. అపార్టుమెంట్‌ సెల్లార్లలో నీరు నిలిచిపోయింది. బస్తీల్లోను, రోడ్లపైనా.. ఎక్కడ చూసినా నీరేనీరు. గత మూడు రోజులుగా కురుస్తున్న వానలు హైదరాబాదీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇంతలో మరో రెండు రోజులపాటు హైదరాబాదులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చేసిన ప్రకటన వెన్నులో వణుకుపుట్టిస్తోంది. దీంతో హైదరాబాదీలు వణికిపోతున్నారు. ఇప్పటికే హుస్సేన్‌ సాగర్‌ తోపాటు చెరువులన్నీ నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కట్టలు తెగితే పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యల్లో పాలుపంచుకుంటున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది విధులు వీడడం లేదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షలతో పరిస్థితిని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే, హైదరాబాద్‌ లో ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. ఏసీపీ, డీసీపీ సహా పోలీసు అధికారులంతా 24 గంటలూ స్టేషన్ల పరిధిలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. అవసరమైన చోట ప్రభుత్వాన్ని సంప్రదించాలని హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ప్రకటించింది.

  • Loading...

More Telugu News