: డియర్ ప్రెసిడెంట్ ఒబామా... సిరియాలో గాయపడ్డ ఒమ్రాన్ ని తీసుకువస్తారా?: ఆరేళ్ల బాలుడి లేఖ
గత ఆగస్టులో సిరియాలోని అలెప్పోలో జరిగిన వైమానిక దాడుల్లో గాయపడి, నిర్ఘాంతపోయిన బాలుడు ఒమ్రాన్ దక్నీశ్ ని మర్చిపోలేము. దుమ్ము, రక్తంతో తడిసిపోయిన ఆ బాలుడికి రెస్క్యూ సిబ్బంది సేవలందించారు. ఈ బాలుడి ఫొటో నాడు వైరల్ గా మారడంతో హృదయమున్న ప్రతిఒక్కరూ స్పందించారు.. ఆవేదన వ్యక్తం చేశారు. అదే క్రమంలో అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఆరేళ్ల బాలుడు అలెక్స్ కూడా స్పందించాడు. అమెరికా అధ్యక్షుడు ఒబామా కు ఒక లేఖ రాశాడు. ఆ లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ లేఖ సాగిన తీరు...‘డియర్ ప్రెసిడెంట్ ఒబామా... సిరియాలో ఈమధ్య జరిగిన దాడుల్లో గాయపడ్డ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు అతను ఎక్కడున్నా వెతికి మా ఇంటికి తీసుకువస్తారా? ఆ బాలుడిని తీసుకువచ్చేవరకు మేము జెండాలు, పూలు, బెలూన్లతో ఎదురుచూస్తుంటాం. అతన్ని ఒక సోదరుడిలా చూసుకుంటాను.. అతనికి మంచి కుటుంబాన్నిస్తాం’ అంటూ ఆ చిన్నారి తన హృదయ స్పందనను లేఖ ద్వారా ఒబామాకు తెలియాజేశాడు. గత వారం జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఒబామా ఈ ఉత్తరం గురించి ప్రస్తావించారు. ఆ సమావేశంలో ఒబామా ఈ లేఖను చదివి వినిపించారు. తాజాగా, వైట్ హౌస్ అధికారులు ఆ ఉత్తరాన్ని అలెక్స్ చేత చదివించి వీడియోలో రికార్డు చేశారు. ఆ వీడియోను ఈరోజు విడుదల చేశారు. వైట్ హౌస్ ఫేస్ బుక్ ఖాతాలో ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా చిన్నారి అలెక్స్ ను ఒబామా అభినందించారు.