: అమెరికా షార్లట్ నగరంలో చెలరేగిన ఆందోళనలు.. అత్యవసర పరిస్థితి విధింపు
అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల క్రితం బ్రింట్లీ విన్సెంట్ అనే పోలీసు అధికారి షార్లట్ నగరంలో 43 ఏళ్ల నల్లజాతీయుడు కీత్ లామంట్ స్కాట్ పై ఈ కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ నల్లజాతీయులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నిన్న పోలీసులపై విరుచుకుపడ్డ ఆందోళనకారులు ఈరోజు కూడా రెచ్చిపోవడంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. దీంతో షార్లట్ నగరంలో అత్యవసర పరిస్థితిని విధించినట్లు ఉత్తర కరోలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఆందోళనలు చెలరేగుతున్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు భద్రతా బలగాల సంఖ్యను మరింత పెంచినట్లు పాట్ మెక్ క్రోరీ తెలిపారు. ఆందోళనకారులు జరిపిన దాడుల్లో ఏడుగురు పోలీసులకు గాయాలయినట్లు తెలుస్తోంది. షార్లట్ పరిస్థితులు మరింత ఉద్ధృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆ నగర మేయర్ జెన్నిఫర్ రాబర్ట్స్ తెలిపారు. ఆందోళనకు దిగిన వారు తమ నిరసనలను విరమించుకోవాలని కోరారు. నల్లజాతీయుడిపై జరిగిన కాల్పుల ఘటనపై పక్షపాతం లేకుండా దర్యాప్తు చేపడతామని తెలిపారు.