: పెద్ద దుప్పిని మింగేసి, ప్రాణాలొదిలిన కొండచిలువ!
పెద్ద దుప్పిని మింగిన కొండచిలువ ఒకటి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ సంఘటన గుజరాత్ లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సమీపంలో జరిగింది. జగన్నాథ్ జిల్లాలోని బలియవాడ్ గ్రామంలో 20 అడుగుల కొండ చిలువ ఒకటి పెద్ద దుప్పిని మింగింది. అనంతరం, రోడ్డుపైకి చేరిన ఆ కొండచిలువ కదలలేక అక్కడే పడి ఉంది. దానిని గుర్తించిన గ్రామస్తులు, అటవీశాఖాధికారులకు సమాచారమిచ్చారు. కొండచిలువను రక్షించే ప్రయత్నం చేసేలోపే అది మరణించిందని, బహుశ దుప్పిని ఆరగించుకునే క్రమంలో అది విఫలమై ఉండవచ్చని, దుప్పిని మింగడం మూలంగా కొండ చిలువకు అంతర్గతంగా గాయాలై ఉండవచ్చని అటవీ శాఖాధికారులు పేర్కొన్నారు.