: ‘ఫోర్బ్స్’ జాబితాలో ‘పతంజలి’ బాలకృష్ణ
యోగా గురు రాందేవ్ బాబా సహాయకుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ‘ఫోర్బ్స్’ జాబితాలో తొలిసారిగా స్థానం సంపాదించారు. భారత బిలియనీర్ల టాప్-100 జాబితాలో 48వ స్థానంలో నిలిచారు. సుమారు రూ.16,000 కోట్ల సంపద కలిగి ఉన్న ఆచార్య బాలకృష్ణ వయసు 44. భారత్ లో ‘పతంజలి’ సంస్థ ఉత్పత్తుల వినియోగం వేగంగా పెరుగుతోందని, దీని నికర విలువ ఆధారంగా, సంస్థలో 92 శాతం వాటాను కలిగి ఉన్న బాలకృష్ణను ఈ జాబితా కింద ఎంపిక చేసినట్లు ‘ఫోర్బ్స్’ పేర్కొంది. కాగా, పతంజలి సంస్థలో రాందేవ్ బాబాకు వాటాలున్నప్పటికీ, ఈ సంస్థ కార్యకలాపాలు నడిపే వ్యక్తి మాత్రం బాలకృష్ణ అని ఆ పత్రిక పేర్కొంది. గత ఏడాది రూ.5,000 కోట్ల ఆదాయాన్ని సాధించిన ‘పతంజలి’ ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.