: వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు... హెలికాప్టర్లను రంగంలోకి దింపనున్న అధికారులు
గుంటూరు జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో రహదారులపైకి నీరు వచ్చేసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్రోసూరు మండలంలోని వూటుకూరు వాగులో కొద్ది సేపటి క్రితం ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు రావడంతో ఈ ఘటన జరిగింది. బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో కొందరు బస్సుపైకి ఎక్కి కూర్చున్నారు. తమని రక్షించమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వారిని కాపాడేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. వారికి ఆహారాన్ని కూడా అందించాలని యోచిస్తున్నట్లు కొమ్మాలపాటి శ్రీధర్ మీడియాకు తెలిపారు.