: కారంపూడి వద్ద ఎర్రవాగు, దాచేపల్లి వద్ద నాగులేరు, మాచర్ల వద్ద చంద్రవంక... గుంటూరు జిల్లాకు భారీ గండం!
గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో గత రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి వాగులు, వంకలు అత్యంత ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు కొట్టుకుపోయారు. రొంపిచర్ల వద్ద కురిసిన వర్షాలకు కారంపూడి వద్ద ఎర్రవాగు బ్రిడ్జిలపై నుంచి ప్రవహిస్తోంది. దాచేపల్లి, కారంపూడి, రెంటచింతల, పులిపాడు, దైద ప్రాంతాల్లో వర్షానికి నాగులేరు, వెల్దుర్తి, శిరిగిరిపాడు, మాచర్ల తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి చంద్రవంక పొంగి పొరలుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా 9.3 సెంటీ మీటర్ల నుంచి 24.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడచిన 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వర్షపాతాన్ని కొన్ని గంటల వ్యవధిలో చూసిన గుంటూరు జిల్లా ఇప్పుడు భారీ నీటి గండం ముందుంది. ఒక గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్లేందుకు కూడా వీలు లేకుండావుంది. ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపివేశారు. రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితి. వర్షం పూర్తిగా తగ్గక పోవడంతో వాగుల్లో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 60 శాతం గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిపివేయగా, నిత్యావసరాలకు సైతం కొరత ఏర్పడింది. రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించేందుకు సైతం వరద నీరు తీవ్ర అడ్డంకిగా మారింది. అధికారులు ఎటూ కదల్లేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. 80కి పైగా గ్రామాలు పూర్తిగా నీట మునగగా, మరో 100 గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. నకరికల్లులో అత్యధికంగా 24.1 సెం.మీ. వర్షం కురవగా, నరసరావుపేటలో 22.4 సెం.మీ, ఫిరంగిపురంలో 16.3 సెం.మీ, సత్తెనపల్లిలో 16.1 సెం.మీ వర్షం కురిసింది. నడికుడి జంక్షన్ నుంచి గుంటూరు మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఈ మార్గంలోని స్టేషన్లలో ఐదు రైళ్లు ఆగివుండగా, వాటిల్లో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కూడా ఉంది. వరదనీరు పూర్తిగా తగ్గిన తరువాతే రైల్వే ట్రాక్ ల పునరుద్ధరణకు వీలుండటంతో, మరో రెండు రోజులు రైళ్లు ఎక్కడివక్కడే నిలిచే అవకాశం ఉంది. దీంతో ఆయా రైళ్లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని సమీపంలోని పట్టణాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.