: హైదరాబాద్‌లోని శివంరోడ్డులో కుంగిన రోడ్డు.. భారీగా ట్రాఫిక్ జాం.. వాహనాల దారి మళ్లింపు
హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి నగరంలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రహదారులపై వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్పందిస్తూ పలు చోట్ల రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఈరోజు ఉదయం నగరంలోని అంబర్పేట సమీపంలో ఉన్న శివంరోడ్డులో రహదారి కుంగిపోయింది. దీంతో ఆ రోడ్డుపై నుంచి వెళుతున్న ఓ లారీ నేలలోకి దిగబడి పోయింది. ఆ రహదారిలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడి వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ను మరో మార్గంలో మళ్లిస్తున్నారు.