: వాట్స్ యాప్ వదిలి 'అల్లో' వెంట స్మార్ట్ ఫోన్లు... కారణాలివే!
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లు వాడుతూ, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ 'వాట్స్ యాప్'ను వాడుతున్న యువత మనసు మారుతోంది. గూగుల్ విడుదల చేసిన సరికొత్త యాప్ 'అల్లో' ఇప్పుడు దూసుకెళుతోంది. వాట్స్ యాప్ వాడుతున్న వారు ఇప్పుడు అల్లో వెంట పడుతున్నారు. వాట్స్ యాప్ కు పోటీగానే దీన్ని విడుదల చేస్తున్నామని గూగుల్ స్వయంగా ప్రకటించిన వేళ, ఈ యాప్ కు యువత దగ్గర అవుతుండటానికి కారణాలివే. గూగుల్ అసిస్టెంట్: ఈ యాప్ లో గూగుల్ సెర్చ్ అసిస్టెంట్ లభిస్తుంది. అంటే ఏదైనా సెర్చ్ చేయాలంటే, యాప్ ను మూసేసి, గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే సెర్చ్ చేయవచ్చు. అక్కడ లభించే వీడియోలు, చిత్రాలు, లింక్ లను పంచుకోవచ్చు. స్మార్ట్ రిప్లై: దీనిలో స్మార్ట్ రిప్లై ఫీచర్ అత్యంత ఆకర్షణీయం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే ఈ ఫీచర్ యూజర్ల మెయిల్ వ్యూయింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. సమాచారాన్ని చదివి, మీరు అటువంటి సమాచారం చదివినప్పుడు గతంలో వినియోగించిన 'హహహ', 'లోల్' వంటి పదాలను సమాధానంగా పంపుతుంది. ఇన్ కాగ్నిటో మోడ్: ఎంత నెట్ వాడకందారులైనా, సోషల్ మీడియా పిచ్చోళ్లయినా, ఏదో ఒక దశలో ప్రైవసీ కోరుకుంటారు. కాసేపు సెల్ పక్కన పెడతారు. అటువంటి సమయాల్లో ఉపయోగపడేలా, ఇన్విజబుల్, లాక్ స్క్రీన్ తదితర సదుపాయాలను కల్పిస్తూ, ఇన్ కాగ్నిటో మోడ్ ను అల్లో వెంట తెచ్చింది. ఇమేజ్ రికగ్నిషన్: గూగుల్ గతంలో విడుదల చేసిన విప్లవాత్మక ఫోటోల గుర్తింపు ఫీచర్ అల్లోకు మరో ఆకర్షణ. మన స్నేహితులు, బంధువుల చిత్రాలను ఇది గుర్తిస్తుంది. ఓ కుక్కకు, మనిషికి ఉండే తేడానూ గుర్తు పడుతుంది. మీకు దగ్గరి స్నేహితుల ఫోటోలు వస్తే అలర్ట్ చేస్తుంది కూడా. జీ మెయిల్ అకౌంట్ సింక్: యూజర్ల జీ మెయిల్ కు వస్తున్న ఈ-మెయిల్ వివరాలను ఈ యాప్ నోటిఫికేషన్స్ రూపంలో చూపిస్తుంటుంది. ఆ మెయిల్స్ వివరాలను ఇక్కడే తెలుసుకుంటూ ఉండవచ్చు. ఆటో డిలీట్: పాత మెసేజ్ లను డిలీట్ చేసేలా ఆటో డిలీట్ సదుపాయం ఉంది. ఒక గంటనో, ఒక రోజనో టైం ముందుగానే సెట్ చేసి పెడితే, ఆ సమయానికి ఉన్న అన్ని పూర్వ మెసేజ్ లనూ యాప్ తుడిచేస్తుంది. దీని వల్ల ఫోన్ లోని మెమోరీ ఆదా అవుతుంది. మీరు చదవగానే డిలీట్ అయిపోవాలన్న ఆప్షన్ కూడా ఉంది. ఫాంట్ సైజ్ పెంచుకునే అవకాశం: యాప్ లో సమాచారం మరీ చిన్న అక్షరాల్లో ఉందని భావిస్తే, అక్షరాల సైజ్ ను పెంచుకోవచ్చు. ఇలా వాట్స్ యాప్ అందించని సౌకర్యాలను అల్లో దగ్గర చేయడంతోనే ఈ యాప్ కు డౌన్ లోడ్స్ పెరుగుతున్నాయి.