: కత్తి వాడడం కూడా రాదని వెక్కిరించింది.. అందుకే అన్ని సార్లు పొడిచా: ఢిల్లీ 'కరుణ' హంతకుడు


ఢిల్లీ నడిబొడ్డున కరుణ అనే టీచర్ ను 22 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన సురేందర్ సింగ్ పోలీసు విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. 2012 నుంచి తమ ఇద్దరి మధ్య సంబంధం ఉందని అన్నాడు. ఈ మేరకు వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను పోలీసులకు చూపించాడు. నాలుగేళ్ల పాటు తమ మధ్య బంధం బాగానే సాగిందని, ఏడాదిగా ఒడిదుడుకులకు గురవుతూ సర్దుకుందని తెలిపాడు. ఈ మధ్య కాలంలో ఆమె ప్రవర్తనలో తేడా కనిపించడంతో ఆమె ఫేస్ బుక్ పేజ్ ఓపెన్ చేశానని, అందులో మోహిత్ అనే వ్యక్తితో ఆమె అనుబంధం పెంచుకుంటున్న విషయం నిర్ధారణ అయిందని, ఆమె మోహిత్ కు అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలు పంపిందని, అసభ్యంగా ఛాటింగ్ కూడా చేసిందని చెప్పాడు. దీంతో వాటిపై మాట్లాడేందుకు ఆమెకు ఫోన్ చేసి తాము ఎప్పుడూ కలుసుకునే జీటీబీ మెట్రోస్టేషన్ వద్దకు రమ్మని పిలిచానని తెలిపాడు. అయితే, ఇంకో వ్యక్తి పట్ల వ్యామోహం పనికిరాదని చెప్పే ప్రయత్నం చేయడంతో ఆమె ఎదురు తిరిగిందని, దీంతో ఫేస్ బుక్ లో ఆమె ఫోటోలు, ఛాటింగ్ సంగతి ఎత్తి చూపానని, తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడాల్సిన కరుణ తనను గూఢచర్యం చేస్తున్నావా? అని నిలదీసిందని, ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయడాన్ని తప్పు పట్టి, తనను తిట్టిపోసిందని తెలిపాడు. దీంతో ఆగ్రహానికి గురైన తాను ఇంకోసారి ఇలాంటి పని చేస్తే పొడిచేస్తానని ఆమె బ్యాగుపై కత్తిని వుంచి ఆడించానని చెప్పాడు. దీంతో 'నీకు కత్తి ఎలా వాడాలో కూడా తెలియదు' అంటూ కరుణ తనను ఎద్దేవా చేసిందని సురేందర్ తెలిపాడు. తనకు కత్తి ఎంత బాగా వాడటం వచ్చో చూపించాలనే ఉద్దేశంతోనే ఆమెను అన్నిసార్లు కత్తితో పొడిచానని పోలీసులకు విచారణలో తెలిపాడు. ఆమెను హత్య చేసిన తరువాత పోలీసులకు ఫోన్ చేసింది కూడా తానేనని వారికి తెలిపాడు. దీంతో పోలీసులు వారి మొబైల్ ఫోన్ లొకేషన్లను ట్రేస్ చేయగా, హత్యకు గంట ముందు నుంచి వారిద్దరూ అతను చెప్పిన ప్రదేశంలోనే ఉన్నట్లు తేలింది. అలాగే, కరుణ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన పోలీసులు సురేందర్ సింగ్ చెప్పినట్టు వారద్దరి ఫోటోలను కూడా గుర్తించారు.

  • Loading...

More Telugu News