: కోలీవుడ్ అభిమానుల మనసులు మరోసారి గెలుచుకున్న హీరో విశాల్
సినీ నటుడు విశాల్ తన మంచి మనసుతో మరోసారి కోలీవుడ్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 19న చెన్నైలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును అడ్డదిడ్డంగా నడిపి 13 ఆటోలను ఢీ కొట్టిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తూ మృతిచెందిన ఆర్ముగం (28) కుటుంబాన్ని ఆదుకునేందుకు విశాల్ ముందుకు వచ్చాడు. నడిగర్ సంఘం కార్యదర్శి కాక ముందు నుంచే సేవా కార్యక్రమాలు చేపట్టిన కోలీవుడ్ నటుడు విశాల్, చెన్నైలో వరదల సమయంలో సంఘ సభ్యులతో పలు కార్యక్రమాలు నిర్వహించాడు. తాజాగా ప్రమాదంలో ఆర్ముగం మృతిచెందడంతో అతని కుటుంబం దిక్కులేనిదైందని తెలుసుకున్నాడు. దీంతో తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి తాలూకా అక్కూరు గ్రామానికి వెళ్లిన విశాల్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాడు. కుటుంబం నిలదొక్కుకునేందుకు ఆర్ముగం భార్యకు కిరణా షాపు పెట్టుకునేందుకు సాయం చేస్తానని, వారి కుమార్తె మనీషా (7) చదువుకయ్యే ఖర్చును ఒక అన్నగా భరిస్తానని మాట ఇచ్చాడు. విశాల్ మంచి మనసుకు అభిమానులు మరోసారి ఫిదా అయిపోయారు.