: నేడు, రేపు హైదరాబాదును ముంచెత్తనున్న వర్షాలు: వాతావరణ శాఖ
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతుండగా, హైదరాబాదు అతలాకుతలమవుతోంది. ఇప్పటికే జంటనగరాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అపార్ట్ మెంట్లలోని సెల్లార్ లలో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన నీరు పూర్తి స్థాయిలో బయటకు వెళ్లే దారిలేక ప్రజలను తీవ్ర ఇక్కట్లపాలు చేస్తోంది. ఇంకా వర్షాల నుంచి హైదరాబాదీలు తేరుకోలేదు. అలాంటి సమయంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని, గురు, శుక్రవారాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి బలపడిందని తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.